Monday, September 14, 2015

వచ్చే 6 నెలల్లో 50 వేల కిలోమీటర్ల నిర్మాణం

వచ్చే 6 నెలల్లో 50 వేల కిలోమీటర్ల నిర్మాణం
హైవే నెట్‌వర్క్ పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: వచ్చే ఆరు నెలల్లో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను మరో 50 వేల కిలోమీటర్ల మేర పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. ఎన్‌డీఏ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో 7 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. దీంతో దేశంలోని హైవే రోడ్ల నెట్‌వర్క్ లక్ష కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను లక్షన్నర కిలోమీటర్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈమధ్యే రోడ్డ రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందుకోసం వచ్చే ఆరు నెలల్లో మరో యాభై వేల కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంటుంది. 1998-2004 మధ్యకాలంలో వాజపేయి ప్రధానిగా ఉన్న హయాంలో నిర్మించిన 23,814 కిలోమీటర్ల రోడ్ల కంటే ఇది రెట్టింపు.

అంతేకాదు పదేండ్ల యూపీఏ-1, 2 ప్రభుత్వాల హయాంలో నిర్మించిన 18 వేల కిలోమీటర్ల రోడ్ల కంటే దాదాపు మూడు రెట్లు అధికం. స్వల్పకాలంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే త్వరత్వరగా ప్రాజెక్టులను కేటాయించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. అంతేకాదు జిల్లాలు, వ్యాపార కేంద్రాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇతర పర్యాటక కేంద్రాలను కనీసం రెండున్నర లేన్ల రోడ్లతో అనుసంధానించాలని మంత్రిత్వ శాఖ అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

No comments:

Post a Comment