చారిత్రక సినిమా చేయాలని వుంది!
తెలుగు చిత్రసీమకు నేనెప్పుడూ దూరం కాలేదు. అనుకోకుండా ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాను అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఆమె కథానాయికగా నటించిన తమిళ అనువాద చిత్రం జయసూర్య ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా ముచ్చటించింది కాజల్ అగర్వాల్. ఈ సొగసరి చెప్పిన సంగతులివి...
ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కాబట్టి మనసును ఉల్లాస పరిచే పనుల్నే చేయండి. ప్రియమైన వారి సమక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఒకరిపట్ల వున్న ప్రేమను వారికి తెలియజెప్పండి. అప్పుడే జీవితం ఆనందంగా వుంటుంది.
జయసూర్య చిత్రంలో తొలిసారి విశాల్‌తో కలిసి నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
వృత్తిపట్ల అంకితభావం కలిగిన వ్యక్తి విశాల్. నటనలో పర్‌ఫెక్షన్ కోసం తపిస్తారాయన. సెట్స్‌లో అందరితో వినయంగా వుంటారు. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది.
సినిమాలో మీరు చేసిన పాత్రకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
ఈ సినిమాలో నా పాత్రపేరు సౌమ్య. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ప్రతి విషయంలో అతిగా భయపడే యువతిగా కనిపిస్తాను. ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలన్నా భయమే. దెయ్యాలు, భూతాలున్నాయేమోనని భయపడుతుంటాను. ఆమె జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పుతుంది. అదేమిటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అభినయప్రధానంగా సాగే నా పాత్ర సినిమాలో చాలా కీలకంగా వుంటుంది.
నిజ జీవితంలో మీకు ఏమైనా భయాలున్నాయా?
రియల్‌లైఫ్‌లో నేను చాలా ధైర్యంగా వుంటాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా వుంటాను.
గత కొంతకాలంగా తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు? తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంవల్లనే మిళందృష్టిపెడుతున్నారా?
అలాంటిదేమీ లేదు. గతంలో మాదిరిగానే తెలుగులో నాకు మంచి అవకాశాలొస్తున్నాయి. రెండేళ్ల కిత్రం తెలుగులో బిజీగా వున్నాను. అప్పుడు తమిళ మీడియా వారు ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు నటిస్తున్న తమిళ చిత్రాల్ని రెండేళ్ల క్రితమే అంగీకరించాను. అవి వరుసగా సెట్స్‌మీదకు రావడంతో తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతోంది. తెలుగు పరిశ్రమకు నేనెప్పుడూ దూరం కాలేదు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సర్దార్ గబ్బర్‌సింగ్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను.
గతంతో పోల్చితే తెలుగులో కాజల్ హవా తగ్గిందని అంటున్నారు?
ఆ మాటల్ని నేను ఒప్పుకోను. టెంపర్ తర్వాత తెలుగు సినిమాలకు సంవత్సరం గ్యాప్ వచ్చింది. అది ఎవరికైనా సహజమే. ఒక్క సంవత్సరంలో పది సినిమాలు చేయలేం కదా? నచ్చిన కథల కోసం వెయిట్ చేసే క్రమంలో గ్యాప్ రావడం సహజం. దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలుగులో నా ప్రాభవం తగ్గిందనడం కరెక్ట్ కాదు.
చిత్ర సీమలో కథానాయికలపై గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు?
నేను వివాదాలకు దూరంగా వుంటాను. నాపనేదో నేను చేసుకుపోతాను. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన తర్వాత సినిమాల గురించి అస్సలు ఆలోచించను. సాయంత్రం ఆరుదాటిందంటే కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి నాదైన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాను. ఇక నాపై వచ్చే గాసిప్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోను. నేనేమిటో నా కుటుంబ సభ్యులకు తెలుసు. కాబట్టి ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను.
తెలుగు, తమిళ, హిందీ...మూడు భాషల్లో బిజీగా వున్నారు. షూటింగ్స్ మధ్య ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?
కెరీర్ ఆరంభం నుంచి మూడు భాషలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నాను. ముందస్తు ప్రణాళిక ప్రకారమే డేట్స్ ఇస్తాను కాబట్టి షూటింగ్ విషయంలో ఎప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. వృత్తిపరంగా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా అవి వెంటనే సమసిపోతాయి.
రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర మీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ మధ్యన విడుదలైన బాహుబలి చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
రాజమౌళిగారి సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనొక లివింగ్ లెజెండ్. మగధీర చిత్రం ద్వారా నాకు రాజమౌళిగారితో పనిచేసే అదృష్టం దక్కింది. భవిష్యత్తులో ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
సినిమాలపరంగా జయాపజయాల్ని ఎలా స్వీకరిస్తారు?
పరిశ్రమలో ప్రతి శుక్రవారం ఫలితాలు తారుమారవుతుంటాయి.. సక్సెస్ వస్తే హ్యాపీగా ఫీలవుతాను. ఫెయిల్యూర్ వస్తే దాన్ని వెంటనే మర్చిపోయి తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తాను. సినిమా అనేది టీమ్‌వర్క్. ఇక్కడ జయాపజయాలు ఏ ఒక్కరి చేతులో వుండవు. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. అయితే నటనాపరంగా ఎక్కడైనా తప్పుచేశానని భావిస్తే దాన్ని తర్వాతి సినిమాలో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను.
నంబర్‌వన్ స్థానంపై మీ అభిప్రాయమేమిటి? మీ సమకాలీన కథానాయికల మధ్య ఎలాంటి పోటీ వుందనుకుంటున్నారు?
నంబర్‌స్థానం గురించి ఆస్సలు పట్టించుకోను. మనసుకు నచ్చిన మంచి సినిమాలు చేయడం గురించే ఆలోచిస్తాను. మిగతా హీరోయిన్స్‌తో నాకు చక్కటి స్నేహసంబంధాలున్నాయి. నేను ఎవరినీ పోటీగా భావించను. వారి విజయాల్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను.
డ్రీమ్స్ రోల్స్ ఏమైనా వున్నాయా?
యాక్షన్ సినిమాతో పాటు ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమా చేయాలని వుంది. వీటితో పాటు ఓ చారిత్రక చిత్రంలో నటించాలన్నదే నా డ్రీమ్.
ప్రస్తుతం అగ్ర కథానాయికలు చాలా మంది మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నారు. మీరు మాత్రం పూర్తిగా కమర్షియల్ సినిమాల్నే చేస్తున్నారెందుకని?
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని నాకూ వుంది. అయితే కథలు నచ్చక కొన్ని సినిమాల్ని వద్దనుకున్నాను. మంచి కాన్సెప్ట్‌తో ఎవరైనా ముందుకు వస్తే మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తాను. అలాంటి సినిమాల్లో పాత్రపరంగా ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా వున్నాను.
ఇంతకి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పరిశ్రమకు దూరమవుతారా?
ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాను. జరగాల్సిన టైమ్‌లో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతాను.
మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా వుండాలనుకుంటున్నారు?
ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాను. జరగాల్సిన టైమ్‌లో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతాను.
మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా వుండాలనుకుంటున్నారు?
ఉన్నత విద్యావంతుడై వుండాలి. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవితాన్ని గడపగలగాలి. ప్రతి విషయంలో ఆశావహ దృక్పథాన్ని కలిగివుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా చక్కటి హాస్య చతురత కలిగివుండాలి.
సహజీవనంపై మీ అభిప్రాయమేమిటి?సహజీవనమనేది వ్యక్తిగత విషయం. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ, చక్కటి అవగాహన వుంటే కలిసి వుండటంలో తప్పేమి లేదనుకుంటాను. సహజీవనం సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. అయితే నేను మాత్రం పెళ్లయ్యేంత వరకు నా తల్లిదండ్రులతోనే కలిసి వుండాలనుకుంటున్నాను.
సినిమాలు కాకుండా మీ వ్యక్తిగత ఇష్టాలేమిటి?
నేను పుస్తకాలు బాగా చదువుతాను. అమీష్ త్రిపాఠి, ఆయాన్ర్యాండ్, జాయ్దత్తా నా అభిమాన రచయితలు. ప్రపంచ యాత్రలన్నా నాకు ఇష్టమే. అమెరికాతో పాటు యూరప్, దక్షిణాసియాలోని అందమైన ప్రదేశాల్ని సందర్శించడాన్ని ఇష్టపడతాను. ముఖ్యంగా బీచ్‌ల్లో విహరించడమంటే చాలా ఇష్టం.
No comments:
Post a Comment